నవంబర్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ నామినేషన్ నిబంధనలు అమల్లోకి


బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. బ్యాంకు డిపాజిట్లు, సేఫ్టీ లాకర్ల నామినేషన్ ప్రక్రియలో గణనీయమైన మార్పులు తీసుకువస్తూ, కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పులు నవంబర్ 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాదారులు ఇకపై ఒక్కరిని మాత్రమే కాకుండా గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. ఇది డిపాజిట్లకు సంబంధించిన సౌకర్యం. ఈ నామినీలకు ఒకేసారి (jointly) లేదా ఒకరి తర్వాత ఒకరు (sequentially) అనే విధంగా ప్రయోజనం అందేలా ఎంచుకునే స్వేచ్ఛ ఖాతాదారులకు లభిస్తుంది.

అయితే, సేఫ్టీ లాకర్లు మరియు సేఫ్ కస్టడీ వస్తువులు విషయంలో మాత్రం “ఒకరి తర్వాత మరొకరు” పద్ధతి తప్పనిసరి. అంటే, ఒక నామినీ లేకపోతే తర్వాతివారికి హక్కు వస్తుంది.

ఇక, మరో ముఖ్యమైన సౌలభ్యం కూడా ఇందులో ఉంది — నామినీల మధ్య వాటా శాతం (share percentage) ఖాతాదారులే నిర్ణయించవచ్చు. ఉదాహరణకు, నలుగురు నామినీలుంటే, ఎవరికెంత శాతం ఇవ్వాలనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనవచ్చు. అయితే మొత్తం వాటాలు 100 శాతం అవ్వాలి.

ఈ సవరణలతో క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని ద్వారా డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడబడతాయి, వారసత్వ వివాదాలు తగ్గుతాయి.

ఈ నిబంధనలు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం–2025లోని సెక్షన్లు 10, 11, 12, 13 కింద వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిని నోటిఫై చేసింది. అదనంగా, ‘బ్యాంకింగ్ కంపెనీల (నామినేషన్) నిబంధనలు–2025’ పేరుతో సంబంధిత ఫారాలు మరియు మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయని అధికారులు వెల్లడించారు.

మొత్తంగా, ఈ కొత్త విధానం బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, భద్రత, వినియోగదారుల సౌకర్యం మరింత పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *