“గోవా మ్యాచ్‌కు రొనాల్డో గైర్హాజరు – అభిమానుల్లో నిరాశ”


భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణానికి తెరపడింది. ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో భారత్‌కు రాకుండా నిర్ణయం తీసుకున్నారు. ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 సీజన్‌లో భాగంగా గోవా ఎఫ్‌సీతో జరగాల్సిన కీలక పోరుకు రొనాల్డో దూరంగా ఉన్నారు. ఈ వార్తతో దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

సమాచారం ప్రకారం, వరుస మ్యాచ్‌ల వల్ల తీవ్రమైన పనిభారం ఏర్పడడంతో రొనాల్డో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన క్లబ్ అల్ నస్రీ యాజమాన్యానికి తెలియజేశారు. క్లబ్ మేనేజ్‌మెంట్ ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసినా, రొనాల్డో తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఫలితంగా, అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రొనాల్డో భారత్ టూర్ రద్దయింది.

రొనాల్డో రాకపోయినా, అల్ నస్రీ జట్టు మాత్రం షెడ్యూల్ ప్రకారం భారత్‌కు చేరుకుంది. 28 మంది సభ్యులతో కూడిన ఈ బృందం గోవాకు చేరి, బుధవారం స్థానిక నెహ్రూ స్టేడియంలో గోవా ఎఫ్‌సీతో తలపడనుంది. అల్ నస్రీ గత రెండు మ్యాచ్‌లలో రొనాల్డో లేకుండానే విజయాలు సాధించడం గమనార్హం.

ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 డ్రాలో అల్ నస్రీ, ఎఫ్‌సీ గోవా జట్లు గ్రూప్ ‘డి’లో ఉన్నందున రొనాల్డో భారత్‌కు వస్తారని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. కానీ చివరికి ఆ ఆశలు నెరవేరలేదు.

సౌదీ ప్రో లీగ్‌లో మూడో స్థానంలో నిలిచిన అల్ నస్రీ ఈ టోర్నీకి అర్హత సాధించగా, ఇండియన్ సూపర్ లీగ్‌లో సత్తా చాటిన గోవా ఎఫ్‌సీ ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఆడే అవకాశం దక్కించుకుంది. ఈ పోరులో రొనాల్డో లేకపోయినా, మ్యాచ్‌పై ఆసక్తి మాత్రం తగ్గలేదు.

అయినప్పటికీ, రొనాల్డో ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న వేలాది మంది అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “రొనాల్డోను ఒకసారి అయినా లైవ్‌గా చూడాలనుకున్నాం, కానీ అదృష్టం కలిసిరాలేదు” అని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *