తిరుమలలో భక్తులకు అందించబడే ప్రసిద్ధ శ్రీవారి లడ్డూ ధర పెరిగినట్టుగా కొన్ని రోజులుగా సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు తేల్చిచెప్పారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, టీటీడీ కూడా, రాష్ట్ర ప్రభుత్వమూ లడ్డూ ధర పెంపుపై ఎలాంటి చర్చలు జరిపినట్టు లేదని స్పష్టం చేశారు. “లడ్డూ ధర పెంచే ఆలోచనే లేదు… భవిష్యత్తులో కూడా అలాంటిది ఉండదు” అంటూ భక్తులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “కొన్ని బాధ్యతారహిత మీడియా సంస్థలు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాన్ని చేస్తూ, టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే కుట్రతో ఉన్నాయి” అని ఆరోపించారు. “ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి, అసలు ధర పెంచే అంశమే లేనే లేదు” అంటూ భక్తులను బోధించారు.
ఈ ప్రకటనతో, ఇటీవల తిరుమల లడ్డూ ధర పెంపు గురించి వస్తున్న వదంతులకు చెక్ పడినట్లయింది. తిరుమల లడ్డూ ప్రసాదం నమ్మకానికి, పవిత్రతకు చిహ్నంగా నిలిచిన నేపథ్యంలో, దీని ధరను పెంచడం అనే అంశం గురించి ఆలోచించే ప్రసక్తే లేదని టీటీడీ స్పష్టం చేసింది.