ఆంధ్రప్రదేశ్ గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా పటిష్ఠమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెండో దశను మరింత ప్రభావవంతంగా రూపొందించాలని సూచించారు.
మంగళవారం పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “గ్రామీణాభివృద్ధి అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్యమం కావాలి. పల్లె పండగ మొదటి దశలో సాధించిన ఫలితాలను కొనసాగిస్తూ, రెండో దశ ప్రణాళికలు సమగ్రంగా ఉండాలి,” అని ఆయన దిశానిర్దేశం చేశారు.
గ్రామాల్లో మౌలిక వసతులు, శుభ్రత, తాగునీరు, పచ్చదనం, మహిళా సాధికారత వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని పవన్ స్పష్టం చేశారు. “ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలంటే అధికారులు సృజనాత్మకంగా ఆలోచించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి,” అని సూచించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజినీరింగ్ చీఫ్ బాలు నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. పల్లె పండగ 2.0లో అమలు చేయాల్సిన అభివృద్ధి వ్యూహాలు, ఫేజ్ వారీ ప్రణాళికలు, మానిటరింగ్ వ్యవస్థపై విస్తృతంగా చర్చ జరిగింది.