ఇజ్రాయెల్‌లోని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు జరిపిన భయానక దాడి రెండేళ్లు పూర్తయ్యే సరికి మరో విషాదం చోటుచేసుకుంది. ఆ దాడిలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు రోయి షలేవ్ (30) చివరకు మానసిక క్షోభను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 2023 అక్టోబర్ 7న జరిగిన ఆ దాడిలో రోయి కళ్ల ముందే తన ప్రియురాలు మపాల్ ఆడమ్, స్నేహితుడు హిల్లీ సోలమన్ మరణించడం అతనికి జీవితాంతం మానసిక గాయం అయ్యింది.
ఆనాటి జ్ఞాపకాలు అతన్ని రోజుకో రాత్రి వెంటాడుతూనే వచ్చాయి. చివరికి ఇక భరించలేనని భావించిన రోయి, టెల్ అవీవ్‌లోని ఒక కారులో తన జీవితాన్ని ముగించాడు. అధికారులు కాలిపోయిన కారులో రోయి మృతదేహాన్ని గుర్తించారు. మరణానికి కొన్ని గంటల ముందు, అతను సోషల్ మీడియాలో తన చివరి సందేశం రాశాడు — “దయచేసి నన్ను చూసి కోపగించుకోవద్దు. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. నా లోపల ఉన్న ఈ బాధ ముగియాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను బతికే ఉన్నాను, కానీ నా లోపల అంతా చచ్చిపోయింది.”
ఈ పోస్టును చూసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించేలోపే అనర్థం జరిగిపోయింది. మీడియా రిపోర్టుల ప్రకారం, అతను చివరిసారిగా పెట్రోల్ డబ్బా కొనుగోలు చేస్తూ కనిపించాడు. నోవా ఫెస్టివల్ దాడి సమయంలో రోయి తన ప్రియురాలిని కాపాడేందుకు ఆమెపై పడుకున్నాడు. గంటలపాటు చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డా, మపాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ సంఘటనపై మపాల్ సోదరి మయాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “రోయిని అక్టోబర్ 7ననే హత్య చేశారు, కానీ అతను నిన్న చనిపోయాడు. ఈ బాధను వర్ణించడానికి మాటలు రావడం లేదు” అని తెలిపింది. మరింత హృదయ విదారకమైన విషయం ఏమిటంటే — ఆ దాడి జరిగిన కొద్ది రోజులకే రోయి తల్లి కూడా తన కారుకు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కుటుంబం మీద వరుసగా పడిన విషాదం ఇజ్రాయెల్ అంతటా దుఃఖాన్ని మిగిల్చింది.