గాజా శాంతి చర్చల మధ్య మోదీ కాల్ – నెతన్యాహు సమావేశం నిలిపివేసి ఫోన్‌లో స్పందన


గాజాలో జరుగుతున్న యుద్ధం, కాల్పుల విరమణ, బందీల విడుదల వంటి కీలక అంశాలపై ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ అత్యవసర సమావేశం జరుగుతుండగా, మధ్యలోనే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమావేశాన్ని నిలిపివేసి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సంభాషణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళికలో భాగంగా గాజా ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినందుకు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తూ, గాజా ప్రజలకు మానవతా సహాయం పెంచడాన్ని స్వాగతించారు.

తరువాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, “నా మిత్రుడు నెతన్యాహును ఫోన్ చేసి ట్రంప్ శాంతి ప్రణాళికలో సాధించిన పురోగతికి అభినందనలు తెలిపాను. బందీల విడుదలకు కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాము. ఉగ్రవాదం ఎక్కడైనా, ఏ రూపంలోనైనా ఆమోదయోగ్యం కాదు,” అని పేర్కొన్నారు.

నెతన్యాహు కార్యాలయం కూడా ఈ ఫోన్ సంభాషణను ధ్రువీకరించింది. భారత–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపైనా, ప్రాంతీయ శాంతి, భద్రత అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపింది.

ఇక మరోవైపు, అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు.

ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, “మేము గాజాలో యుద్ధాన్ని ముగించాం. ఇది చారిత్రాత్మక ముందడుగు. ఇది శాశ్వత శాంతికి నాంది అవుతుంది” అని పేర్కొన్నారు. వచ్చే వారం ఈజిప్టులో అధికారిక సంతకాల కార్యక్రమం జరుగనుందని తెలిపారు.

హమాస్ ప్రతినిధి ఖలీల్ అల్-హయా మాట్లాడుతూ, “ఒప్పందంలోని మొదటి దశ అమలయితే గాజా యుద్ధం పూర్తిగా ముగిసినట్లే. అమెరికా నుంచి ఇందుకు హామీ లభించింది” అని వెల్లడించారు.

దీంతో గాజా ప్రాంతంలో నెలలుగా కొనసాగుతున్న రక్తపాతం తాత్కాలికంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ వేదికలపై కొత్త దశను ప్రారంభించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *