దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి త్రిష, ప్రస్తుతం మరోసారి కెరియర్ పరంగా పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఈ బ్యూటీ, ఇటీవల కొంత కాలం అవకాశాలు తగ్గడంతో నాయికా ప్రధాన పాత్రల్లో కనిపించింది. ‘రాంగీ’, ‘ది రోడ్’, ‘96’ వంటి సినిమాలు ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి.
అయితే ఇటీవల జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో త్రిష మరింత గ్లామరస్‌గా కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. “ఇప్పటికీ త్రిష అందం తగ్గలేదు”, “సీనియర్ హీరోయిన్‌కి ఇంత గ్లామర్ అంటే షాక్” అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆ గ్లామర్ ఫ్యాక్టర్ కారణంగానే త్రిషకు మళ్లీ పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు రావడం ప్రారంభమైంది.
ఇక ఆమె రజనీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులతో పాటు, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన ప్రాముఖ్యతను మరోసారి చూపించింది. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.
ప్రస్తుతం త్రిష తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ వయసులో కూడా తన అందం, గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న త్రిషకు ఇప్పుడు ఒక బ్లాక్‌బస్టర్ హిట్ అవసరం. ఆ విజయాన్ని ‘విశ్వంభర’ లేదా ‘కరుప్పు’ అందిస్తాయా? అనే ప్రశ్నపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.