అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన యువకుడు పోలే చంద్రశేఖర్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో దుర్మరణం పాలయ్యాడు. బీడీఎస్ పూర్తిచేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన చంద్రశేఖర్, అక్కడి డాలస్ నగరంలోని ఒక పెట్రోల్ బంకులో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని అతని స్వస్థలం ఎల్బీనగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. కన్నతండ్రి తల్లికి తీరని విషాదం తలెత్తింది. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా పయనమైన కొడుకు ఇలా మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ ఘటనపై తెలంగాణ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తెలుగు విద్యార్థి ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటనతో అమెరికాలో తుపాకీ సంస్కృతి పై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్ళే భారతీయ విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడం ఎంత ముఖ్యమో మరోసారి బయటపడింది.