నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గురువారం చిత్రబృందం కొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని ప్రకటించింది.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్‌లో బాలకృష్ణ పొడవాటి జుట్టు, గడ్డం, ఒంటిపై రుద్రాక్ష మాలలతో, చేతిలో భారీ త్రిశూలం పట్టుకుని అఘోర గెటప్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఆయన వెనుక మంచుతో కప్పబడిన వాతావరణం మరింత ఆకర్షణీయంగా నిలిచింది.
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ సరసన సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. చిన్నారి నటిగా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది.
సినిమా సంగీత బాధ్యతలు చేపట్టిన తమన్ మరోసారి బాలయ్య సినిమాకు థ్రిల్లింగ్ స్కోర్ ఇవ్వబోతున్నారని టాక్. ఆయన అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళుతుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. సి. రాంప్రసాద్, సంతోష్ డి. డెటకే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ ఆ లిస్టులో ఎలా రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.