పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రం మరోసారి సైనిక చర్యలతో హోరెత్తుతోంది. ముఖ్యంగా కుజ్దార్ జిల్లా జెహ్రీ ప్రాంతంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్ స్థానికులను చిగురుటాకులా వణికిస్తోంది. మానవహక్కుల ఉల్లంఘనల ఆరోపణల నడుమ, ప్రజలపై ప్రయోగిస్తున్న ఆయుధాలు, డ్రోన్ దాడులతో పరిస్థితి మరింత విషమంగా మారింది.
దాడులతో దళం దూకుడు:
పాక్ సైన్యం జెహ్రీలో డ్రోన్లు, మోర్టార్లు, శతఘ్నులు వాడుతూ విరుచుకుపడుతోంది. ఈ దాడుల లక్ష్యం బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) వంటి వేర్పాటువాద ఉగ్రసంఘటనల నిర్మూలన అని అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, పౌరులే ఎక్కువగా నష్టపోతున్నారు.
వాస్తవానికి, దాడులు ఉగ్రవాదులపై కేంద్రీకృతమై ఉండాల్సినా, స్థానిక రైతుల పత్తి పొలాలు నాశనమవ్వడం, ఇళ్లను విడిచి బయటకు రావాలన్న మనోధైర్యం లేకపోవడం, ఆహార కొరతతో అల్లాడిపోవడం వంటి పరిస్థితులు తీవ్ర మానవీయ సంక్షోభానికి దారి తీస్తున్నాయి.
ప్రజలు లాక్‌డౌన్‌లోకి:
ఈ ఆర్మీ దాడుల కారణంగా జెహ్రీ ప్రజలు తాము స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయినట్టుగా తలచుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఇంటికే పరిమితమై జీవితం గడుపుతున్నారు. ఎవ్వరూ బయటకు రాలేకపోతున్నారు.
“ఎప్పుడు ఏ మూల నుంచి బాంబు దూసుకొస్తుందో తెలియని భయం”, జెహ్రీ ప్రజల్ని ఇల్లు వదిలేలా కూడా చేయడం లేదు.
వ్యవసాయ నష్టం, మానవహానీ:
పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా, ఛష్మా ప్రాంతంలో సైన్యం ప్రయోగించిన మోర్టార్లతో పౌరుల మృతి కూడా చోటుచేసుకున్నట్టు సమాచారం. అయితే పాక్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారికంగా స్పందించలేదు.
లక్ష్యం ఉగ్రవాదులేనా?
సైనిక వర్గాల ప్రకారం, జెహ్రీ ప్రాంతం ప్రస్తుతం ఉగ్రవాదుల ఆధీనంలో ఉందని, అక్కడ నుండి ఉగ్రదాడులు, దురాలోచనలు బయటికి వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జెహ్రీను పూర్తిగా మళ్లీ ప్రభుత్వ ఆధీనానికి తీసుకురావడమే లక్ష్యమట. అయితే, ఈ దాడుల్లో పౌరుల ప్రాణాలు పోవడం, ఆస్తి నష్టం, జీవన స్థితిగతులపై ప్రభావం మానవహక్కుల సంస్థల ఆందోళనకు దారి తీసే అవకాశముంది.