వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ – హైదరాబాద్‌కు తరలింపు, సీఎం చంద్రబాబు ప్రార్థనలు


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వైరల్ ఫీవర్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపబడ్డారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలియగానే, రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల సేవలో నిమగ్నం కావాలని, ఈ మధ్య విడుదలైన ‘ఓజీ’ సినిమా విజయంని కూడా ఆనందించాలనీ ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

‘ఓజీ’ సినిమా, పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం, గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ సంపాదించిన ఈ చిత్రం, దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. సినిమాను ఎంజాయ్ చేయాల్సిన సమయంలో పవన్ అనారోగ్యం పాలవడం అభిమానులను ఆవేదనకు గురి చేసింది.

సోషల్ మీడియాలో పవన్ అభిమానులు #GetWellSoonPawanKalyan, #PawanKalyanHealth, #OGSuccess వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రజా సేవలో నిరంతరం నిమగ్నంగా ఉండే పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య కనిపించాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం పవన్ ఆరోగ్యంపై హాస్పిటల్ వర్గాలు వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *