తిరువీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న వేళ.. అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందు చేస్తున్న వేళ.. దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్న వేళ.. భూలోకమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్న వేళ.. జరిగే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే. ప్రతిసేవా వైభవోపేతమే.
బ్రహ్మోత్సం

బ్రహ్మదేవుడే భక్తుడిగా మారి.. శ్రీనివాసుడికి మొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం
చెబుతోంది. సృష్టికారకుడైన బ్రహ్మ.. ఈ ఉత్సవాలను ప్రారంభించిన కారణంగా వీటిని బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. మరో కథనం ప్రకారం.. నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ఖ్యాతిగాంచాయి. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలని కూడా అంటారు.
పురాణాల ప్రకారం … శ్రీనివాసుడు వేంకటాద్రిలో దర్శనమిచ్చిన మొదటి రోజున, వేంకటేశ్వరుడిగా బ్రహ్మ దేవుడిని పిలిచి, లోక కల్యాణం కోసం కొన్ని ఉత్సవాలు నిర్వహించమని ఆదేశించాడట. దీని ప్రకారం ఆశ్వయుజ మాసం శ్రవణా నక్షత్రం నాడు ఆనందనిలయం మధ్యలో వెలసిన శ్రీవేంకటేశ్వరునికి బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు మహా ఉత్సవం నిర్వహించారు. అందుకే దీనిని ‘బ్రహ్మోత్సవం’ అంటారు. నాటి నుంచి నేటి వరకు తిరుమలలో ఈ ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నుల పండువగా జరుగుతాయి. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. వాహనాలపై ఊరేగుతున్న స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవశ్యంలో పరవశించిపోతారు. రోజుకొక వాహనంపై స్వామివారు తిరుమాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించేందుకు సమష్టిగా పనిచేయాలని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహన సేవలు అందుకునే మలయప్పస్వామి భక్తకోటిని కటాక్షించనున్నారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలలో వాహనసేవల వైశిష్ట్యం ఎంతో గొప్పది. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు TTD లోని అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసింది TTD.
బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కానుండగా… శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి సమక్షంలో వేద గానాల మంగళ వాయిద్యాల మధ్య అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025 – ముఖ్య తేదీలు
- 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- 24-09-2025 ధ్వజారోహణం
- 28-09-2025 గరుడ వాహనం
- 01-10-2025 రథోత్సవం
- 02-10-2025 చక్రస్నానం
మలయప్ప స్వామివారి ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా గరుడ వాహనసేవను మాత్రం సాయంత్రం 6.30 నుండి ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామి వారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యదర్శనం కల్పిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు తలల స్వర్ణ శేషవాహనంపై పెద్ద శేషవాహన సేవ అందుకుంటారు. తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు.
గరుడ వాహనం: ఇది బ్రహ్మోత్సవాలలోనే అత్యంత ముఖ్యమైనది. గరుడ సేవ రోజున స్వామివారి మూలవిరాట్టును గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఇది శ్రీవారికి మరియు భక్తులకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.
హంస వాహనం: హంస వాహనంపై శ్రీవారు జ్ఞాన స్వరూపుడై దర్శనమిస్తారు
గజ వాహనం: ఏనుగు శక్తి, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. గజ వాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులకు సకల సంపదలు, బలం కలుగుతాయని తెలియజేస్తుంది
సింహ వాహనం: ఇది శత్రువులను సంహరించే శక్తికి ప్రతీక
అశ్వ వాహనం: ఇది కల్కి అవతారాన్ని సూచిస్తుంది
పల్లకీ ఉత్సవం: ఊయల సేవలు శ్రీవారి పల్లకీ సేవలను భక్తులు ఎంతో ఆసక్తితో చూస్తారు.

అక్టోబర్ 1న ఉదయం 7:00 గంటలకు మలయప్ప స్వామివారి రథోత్సవం, రాత్రి 7:00 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటాయి. అక్టోబర్ 2న ఉదయం 6:00 నుంచి 9:00 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10:00 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు.
రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.
చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క.
తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఈ తొమ్మిది రోజులు శ్రీవారి వైభవాన్ని చూస్తూ.. ఆయన అనుగ్రహాన్ని పొందడం భక్తులందరికీ ఒక అదృష్టం. శ్రీవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… సర్వేజనా సుఖినో భవంతు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం..