విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎంత కీలకమో, ఇటీవల విడుదలైన సూపర్‌హిట్ సినిమా ‘మిరాయ్’ మరోసారి నిరూపిస్తోంది. ఇప్పటికే ₹134 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తున్న ఈ సినిమా, ఇప్పుడు ప్రేక్షకుల డిమాండ్‌ను గౌరవిస్తూ సంచలనాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.
సినిమా ప్రమోషన్‌లలో భాగంగా విడుదలైన ‘వైబ్ అండీ’ అనే పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా యువత ఈ పాటకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే, సినిమా విడుదలైనప్పుడు ఈ పాట ఉండకపోవడం చాలా మంది అభిమానులను నిరాశకు గురిచేసింది. దర్శకుడు కార్తిక్, కథకు ఏకాగ్రత దెబ్బతినకుండా చూసేందుకు ఈ పాటను తొలగించామని స్పష్టంచేశారు.
కానీ, ప్రేక్షకుల నుంచి భారీగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకున్న నిర్మాతలు – ప్రేక్షకులే రాజులు అన్నట్లు నిర్ణయం మార్చుకున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, ‘మంగళవారం (సెప్టెంబర్ 23) నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ ప్రదర్శితమవుతున్న ప్రతి థియేటర్ షోలో ‘వైబ్ అండీ’ పాటను జత చేయనున్నామని తెలిపారు. ఇది ఇప్పటికే సినిమా చూసిన వారికి కూడా మళ్లీ థియేటర్‌కు వెళ్లేలా ప్రేరణనిస్తుందని చిత్రబృందం భావిస్తోంది.
ఈ పాటకు సంగీతం అందించిన గౌర హరి, లిరిక్స్ అందించిన కృష్ణకాంత్, గాత్రం అందించిన అర్మాన్ మాలిక్ కలయిక ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను మాయ చేసింది. ఇప్పుడు థియేటర్లలో ఈ మ్యూజిక్ మ్యాజిక్ ప్రత్యక్షంగా కనిపించబోతోంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం, సినిమా మీద ఇప్పటికే ఉన్న పాజిటివ్ టాక్, పాటకు ఉన్న క్రేజ్ — ఇవన్నీ కలిసొచ్చి ‘మిరాయ్’ కలెక్షన్లను మరింతగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా థియేటర్లకు మళ్లీ రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ కొత్త మార్పుతో ‘మిరాయ్’ ఇంకెంత దూరం దూసుకుపోతుందో చూడాలి.. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు — ఓ మంచి పాట మాజిక్ చేస్తుంది.. మరి ‘వైబ్ అండీ’ అయితే ఆ మాజిక్ రెట్టింపు!