హైదరాబాద్: ఎన్నో జీవరాశుల నివాసమైన ఈ భూమి ఇవాళ ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. “2025 FA22” అనే గ్రహశకలం గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొచ్చి, శాస్త్రవేత్తల ఆందోళనకు కారణమైంది. ఈ గ్రహశకలం వాషింగ్టన్ మాన్యుమెంట్ అంత భారీగా ఉందని నాసా, అంతరిక్ష పరిశోధనా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇది భూమిని ఢీకొనివుంటే, ఒక పెద్ద నగరాన్ని పూర్తిగా నాశనం చేసేసే శక్తి దీంట్లో ఉందని నిపుణులు వెల్లడించారు.
అయితే ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వచ్చినా, ఎటువంటి ప్రమాదం కలగలేదు. శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం, ఇది భూమి నుంచి సుమారు 523,000 మైళ్లు (842,000 కిలోమీటర్లు) దూరంలోనే వెళ్లిపోయింది. ఈ దూరం అంటే భూమి నుండి చంద్రునికి ఉన్న దూరానికి 2.2 రెట్లు.
ఈ అరుదైన అంతరిక్ష సంఘటన సెప్టెంబర్ 18, తెల్లవారుజామున 3:42 EDT (0742 GMT) లేదా భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:12 గంటలకు జరిగింది. ఆ క్షణంలో, శాస్త్రవేత్తలు అంతరిక్ష పరికరాలతో దీన్ని గమనించారు.
అంతేకాకుండా, యూట్యూబ్‌లోని కొన్ని ఛానెల్లు ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రేక్షకులు ఈ లైవ్ స్ట్రీమ్‌లను వీక్షించారు. ఒకవేళ మీరు కూడా ఈ దృశ్యాన్ని చూడాలనుకుంటే, ఇప్పటికీ ఆ వీడియోలను యూట్యూబ్‌లో రికార్డింగ్ రూపంలో చూడవచ్చు.
శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే, ఈ తరహా గ్రహశకలాలు తరచూ భూమి వైపు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో చాలా శాతం భూమి వాతావరణంలోకి రాకముందే కరిగిపోతాయి లేదా చంద్రుని దారిలోకి మరలిపోతాయి. కానీ కొన్ని మాత్రం భూమి దగ్గరగా వెళ్లే సందర్భాలు ఉంటాయి. అందుకే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలను గమనిస్తూ, అవసరమైతే నివారణ చర్యలు చేపట్టాలని నాసా, ESA (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు మనకు ఒక గుర్తు చేస్తాయి – భూమి ఒక విస్తారమైన అంతరిక్ష కుటుంబంలో భాగమని, అంతరిక్షం నుంచి వచ్చే అనుకోని ప్రమాదాలకు కూడా మానవజాతి సిద్ధంగా ఉండాలని. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎన్ని చోటు చేసుకుంటాయో తెలియదు కానీ, శాస్త్రవేత్తల పరిశీలనలు మనకు రక్షణగా నిలుస్తున్నాయి.