ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో మరోమారు మార్పులు సంభవించనున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 18న (సోమవారం) కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. అంతేకాదు ఈ నెల 23వ తేదీన మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఉద్భవించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వాతావరణంపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది.
వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలు ఈ వర్షాల ప్రభావానికి లోనవనున్నాయి.
విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే కళింగపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని సూచించారు. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక వర్షపాతం విశాఖ జిల్లా పద్మనాభంలో నమోదైంది. అక్కడ ఒక్కరోజులోనే 42.25 మిల్లీమీటర్ల వర్షం పడింది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పంపిణీ సమానంగా జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, మరికొన్ని మండలాల్లో మాత్రం చినుకు కూడా పడకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాలు ఇంకా వర్షాభావ పరిస్థితులతో ఎదుర్కొంటున్నాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 298.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 311.6 మిల్లీమీటర్లు కురిసింది. అంటే సగటుతో పోల్చితే 4 శాతం ఎక్కువ. అయితే రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సొసైటీ (SDPS) వెబ్సైట్ గణాంకాల ప్రకారం సగటున 348 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటివరకు 317.1 మిల్లీమీటర్లే కురిసింది. ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైందని తేలింది.
రానున్న రోజుల్లో కొత్త అల్పపీడనాల ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వరద ముప్పు ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే రెవెన్యూ, పోలీస్ విభాగాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. వ్యవసాయరంగానికి ఈ వర్షాలు కొంత ఊరట ఇస్తాయనే ఆశ ఉన్నా, వరదలు, గాలివానలతో నష్టం సంభవించే అవకాశాన్ని విస్మరించరాదు.
