జననం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అమూల్యమైన క్షణం. ఒక కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు కుటుంబమంతా. కానీ ఆ ఆశలన్నీ క్షణాల్లోనే చీకటి ముసురి కన్నీటి ఊబిలో ముంచేసిన ఘటన ఇది.
అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెంకొత్తవీధి మండలం, చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వంతల లక్ష్మి అనే గర్భిణీ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరింది. శనివారం రాత్రి ఆమె గూడెంకొత్తవీధి ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డ శరీరంలో రంగు మారుతూ ఉండటం గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
వెంటనే మెరుగైన వైద్యం కోసం మొదట చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. కానీ ఆ చిన్న పాప బతకలేదు… చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
ఇంతలో తల్లి లక్ష్మికి రక్తస్రావం ఎక్కువవటంతో ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. కానీ శిశువు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ అందించలేదు. దీంతో తండ్రి బుజ్జిబాబు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు.
మృత శిశువు శరీరాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం మూడు వాహనాలు మార్చాల్సి వచ్చింది. మొదట చింతపల్లి వరకు 50 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో, అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఆటోలో, చివరగా మరో 20 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై స్వగ్రామం చేరుకున్నారు. మొత్తంగా 100 కిలోమీటర్ల ప్రయాణం – అది ఒక మృత శిశువుతో!
గుండె తరుక్కుపోయే ఈ సంఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లోనూ మానవత్వం, ప్రభుత్వ వైద్యం పై అనేక ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి.
ఒక పాప మరణించిన దుఖంలో ఉన్న తల్లిదండ్రులకు కనీస సౌకర్యం కూడా లభించకపోవడం వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత… ఇవన్నీ ఈ ఒక్క ఘటనలో ప్రత్యక్షంగా కనిపించాయి.
ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదంటే, ప్రభుత్వ పాలనలో మార్పు రావాలి. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలు, అత్యవసర వాహనాల అందుబాటు కచ్చితంగా ఉండాలి. మానవతా దృక్పథంతో పనిచేసే వైద్య సిబ్బంది అవసరం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న శిశువు మృతదేహంతో పల్లె మార్గాల్లో ప్రయాణిస్తున్న దృశ్యాలు చూడగానే కన్నీరు ఆగడం లేదు. ఇది తల్లిదండ్రులే కాదు, మనమందరినీ కలచివేసే ఉదంతం.
మరణించిన ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… ఈ దేశంలో ఎవరికీ ఇలాంటివి అనుభవించాల్సిన అవసరం రాకూడదని మనం కోరుకుందాం.