అమరావతి శాశ్వత భవనాల కాన్సెప్ట్ డిజైన్లు – ఆగస్టు 8 నాటికి ఖరారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న అమరావతి శాశ్వత రాజధాని కీలక దశను దాటుతోంది. రాజధానిలో నిర్మించబోయే శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనం, సచివాలయ టవర్ల డిజైన్ల ఖరారుకు సమయం దగ్గరపడింది. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ ప్రాజెక్టులకు కన్సెప్ట్ డిజైన్లను తుదిరూపం ఇవ్వనుంది.

నిర్మాణాల శరవేగం

గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఫోస్టర్స్ సంస్థ ఈ డిజైన్లపై పని మొదలు పెట్టింది. ప్రస్తుతం టెండర్లు పూర్తయ్యాయి. గుత్తేదారులతో కలిసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం ఈ భవనాలను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఆగస్టు 8 నాటికి తుది డిజైన్లు సిద్ధం

ఫోస్టర్స్ సంస్థ ఇటీవల గుత్తేదారులు, కన్సల్టెంట్లు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్స్‌తో వర్క్‌షాప్ నిర్వహించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించిన డిజైన్లను ఇప్పటికే తుదిరూపం ఇచ్చారు. ఆగస్టు 4న మరో ప్రతినిధి బృందం రావడంతో, సచివాలయ టవర్ల నమూనాలూ ఖరారవుతాయి. ఆగస్టు 8 నాటికి మూడు భవనాల డిజైన్లు తుది రూపం పొందనున్నాయి. సహజవాతావరణం, ప్రకృతి వెలుతురు

ఈ భవనాల డిజైన్లు సహజసిద్ధమైన వెలుతురు, గాలి రావడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. హైకోర్టు భవనం ఏడు అంతస్తులు ఉండబోతున్నది. న్యాయమూర్తుల ఛాంబర్లు, కోర్టు హాళ్ల నమూనాలపై హైకోర్టు రిజిస్ట్రార్‌తో CRDA అధికారులు విస్తృతంగా చర్చించారు. అసెంబ్లీ భవనం 103.76 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. గ్యాలరీలు, పార్కింగ్, లిఫ్ట్‌లు మొదలైన అంశాలపై చర్చలు జరిగాయి.

గవర్నమెంట్ కాంప్లెక్స్ – భారీ ప్రణాళిక

1,575 ఎకరాల్లో విస్తరించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, సీఎంఓ, ఎమ్మెల్యే, న్యాయమూర్తుల నివాసాలు, ఉద్యోగుల నివాస సముదాయాలు నిర్మించనున్నారు. AGC (Administrative Government Complex) మధ్యలో పచ్చదనం, నీటి ప్రవాహాలతో నీలి-హరిత కాన్సెప్ట్ ఆధారంగా ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్ రూపొందిస్తున్నారు. ఇందుకోసం RFP పిలిచి ల్యాండ్‌స్కేప్ డిజైనర్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

కాలువ, పార్కులు – నగరానికి అందం

7 కిలోమీటర్ల పొడవుతో, కృష్ణా నది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కలువ తవ్వబడుతుంది. ఇది AGC మధ్యనుండి వెళ్తుంది. ఇందులో పడవలు ప్రయాణించేలా ప్రత్యేక డిజైన్ చేస్తున్నారు. కాలువపై కాలిబాట వంతెనలు, దాని ఇరువైపులా వెస్ట్ పార్క్ రోడ్, ఈస్ట్ పార్క్ రోడ్ పేర్లతో పార్కుల అభివృద్ధి జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *