ఒకప్పటి తారాజువ్వ, తర్వాత మౌనంగా మాయమైన కరుణ్ నాయర్ మళ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో సత్తా చాటాడు! 2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ బాదిన తర్వాత, దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 50కి పైగా స్కోరు చేసిన కరుణ్, తన మేటి ఆటతో మరోసారి జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించాడు.
ఓవల్ వేదికగా జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో, 83/3 పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన నాయర్, ఒత్తిడిని ఎదుర్కొంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 98 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది సాధారణ హాఫ్ సెంచరీ కాదనే విషయం, మ్యాచ్ కండిషన్లు చూస్తే అర్థమవుతుంది – గ్రీన్ పిచ్, స్వింగ్‌కు అనుకూలమైన వాతావరణం, లీనంగ ఆటతీరు అవసరం.
ఈ ఇన్నింగ్స్‌తో కరుణ్ నాయర్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 2016లో చెన్నై టెస్ట్‌లో ఇంగ్లండ్ పైనే అజేయ 303 పరుగులు చేసి భారత క్రికెట్ చరిత్రలోకి ప్రవేశించిన కరుణ్ తర్వాత పెద్దగా నిలవలేకపోయాడు. టీమిండియా అవకాశాలు ఇవ్వడంలో వెనుకబడటమే కాక, అతను కూడా ఆ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు. కానీ దేశీయ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శనలతో తిరిగి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన:
2023-24 సీజన్‌లో విదర్భ తరపున 10 మ్యాచ్‌ల్లో 690 పరుగులు,
2024-25 సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 863 పరుగులు చేసి తన స్థిరతను చాటాడు.
ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా తన జట్టుకు రంజీ ట్రోఫీ అందించాడు.
ఈ స్థిరమైన ఫార్మ్‌ను బట్టి సెలక్టర్లు మళ్లీ అతనికి చాన్స్ ఇచ్చారు. ఆ అవకాశం వచ్చిన వెంటనే OG Karun Nair మళ్లీ కనిపించాడు. బౌలర్లకు అనుకూలమైన పిచ్‌పై హాఫ్ సెంచరీ చేసి భారత్‌ను కష్టాల్లోనుంచి బయటపడేసాడు.
ఈ విజయం కరుణ్‌కి మాత్రమే కాదు, ప్రతి దేశీయ ఆటగాడికి స్పూర్తి. అవకాశాన్ని నిరీక్షించి, శ్రమించి తిరిగి దేశానికి ఆడాలంటే కరుణ్ నాయర్ ఒక ప్రేరణ. అతని పునరాగమన కథ మళ్లీ ఒక నిరాశలో ఉన్న ఆటగాడికి ధైర్యం నింపుతుంది.
ఒక ట్రిపుల్ సెంచరీ తర్వాత వచ్చిన 3,148 రోజుల నిరీక్షణ, ఎట్టకేలకు ఓ అర్ధ సెంచరీగా ఫలించింది.

 
				
			 
				
			 
				
			 
				
			