పాలస్తీనా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న నరమేధంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం సిగ్గుచేటుగా ఉందని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం పిరికితనంతో, భయంతో నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె రాసిన వ్యాసం ‘గాజా సంకట్ పర్ మూకదర్శక్ మోదీ సర్కార్’ అనే శీర్షికతో ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ జాగ్రణ్లో ప్రచురితమైంది.
సోనియా గాంధీ తన వ్యాసంలో భారత్ అనుసరిస్తున్న సంప్రదాయ పాలస్తీనా విధానాన్ని స్పష్టంగా గుర్తు చేశారు. పాలస్తీనా ప్రజల పట్ల మద్దతుగా నిలవడంలో గతంలో భారత దేశం ఏవిధంగా అగ్రగామిగా వ్యవహరించిందో వివరిస్తూ, ఇప్పటి ప్రభుత్వం మాత్రం మౌనం ద్వారా తాము ఎక్కడ ఉన్నామో స్పష్టంగా తెలియజేస్తోందని విమర్శించారు.
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే 55,000 మందికిపైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వారిలో 17,000 మంది చిన్నపిల్లలు ఉన్నారన్న విషయాన్ని హృదయ విదారకంగా అభివర్ణించారు. గాజాలో ఇళ్లను నేలమట్టం చేయడం, వైద్యం, నీరు, ఆహారం లేని పరిస్థితిలో ప్రజలను నిలువన ఉరి తీయడమేనని ఆమె విమర్శించారు. ఇది మానవతా విలువలకు తీవ్రమైన అవమానమని పేర్కొన్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ దాడిని ఖండిస్తున్నామని స్పష్టంగా తెలిపిన సోనియా గాంధీ, ఒకవైపు హమాస్ దాడిని నిరసిస్తూ, మరోవైపు గాజాలో జరుగుతున్న మానవహింసలను కూడా అదే స్థాయిలో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పకపోవడం భారత దేశం గత వైఖరికి, గౌరవప్రదమైన చరిత్రకు మచ్చతలమని పేర్కొన్నారు.
ఇంతవరకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలు గాజా పై నరమేధం కోసం అంతర్జాతీయ న్యాయస్థానాల్లో ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చాయని, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి దేశాలు కూడా గాజాలో ఇజ్రాయెల్‌ను తీవ్రంగా తప్పుబడుతున్నాయని వివరించారు. ఇజ్రాయెల్ లోపలే కూడా ప్రజల్లో నిరసన స్వరాలు పెరిగిపోతున్నాయని, ఓ మాజీ ఇజ్రాయెల్ ప్రధాని సైతం గాజాలో యుద్ధ నేరాలను అంగీకరించడమే ఇందుకు ఉదాహరణని చెప్పారు.
గతంలో 1974లో ఇందిరా గాంధీ పాలనలో భారత్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO) ను అధికారికంగా గుర్తించిన తొలి అరబ్‌ేతర దేశంగా నిలిచిందని, అదే విధంగా 1988లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన దేశాలలో భారత్ కూడా ఒకటిగా ఉందని గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో మోదీ మౌనం భారతదేశ ప్రజలకు నిరాశ కలిగిస్తోందని, గ్లోబల్ సౌత్ దేశాలు ఇప్పుడు మళ్లీ భారత్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయన్న వాస్తవాన్ని ప్రభుత్వం గ్రహించాలని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
ఇప్పుడు అయినా భారత ప్రభుత్వం గాజాలో మానవహింసలపై ధైర్యంగా స్పందించి, శాశ్వత కాల్పుల విరమణకు మద్దతు తెలపాలని ఆమె సూచించారు.

 
				
			 
				
			 
				
			 
				
			