తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. స్థానిక సంత ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 62వ ప్రజాదర్బార్ సందర్భంగా ఆయన ప్రజలతో ముఖాముఖి మట్లాడుతూ, వారి సమస్యలను విన్నారు. ఒకొక్కరి సమస్యను ఆప్యాయంగా గమనించి, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వంలో సామాన్యుల సంక్షేమం ఏకైక అజెండా అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన హరిప్రసాద్ నాయుడు తన భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అప్పయ్యపాళెం గ్రామానికి చెందిన ఎస్.వెంకటేష్ నాయుడు తన 20 ఏళ్ల అంగవైకల్యంతో బాధపడుతున్న కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఆధార్ సమస్యల కారణంగా ఇప్పటివరకు సాయం అందలేదని, మానవతా దృష్టితో తనను ఆదుకోవాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఇంటి స్థలంపై కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని మదనంబేడు గ్రామానికి చెందిన సీహెచ్ శాంతి తన విన్నపాన్ని వినిపించారు. తమ స్థలాన్ని రక్షించి ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. మరోవైపు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తన కుమారుడికి ఉపాధి కల్పించాలని నారాయణవనానికి చెందిన భాస్కరన్ విజ్ఞప్తి చేశారు. సమస్యలను మంత్రి సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామంలో అసంపూర్ణంగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యోగ మోసాలపై విచారణ చేయాలని వచ్చిన పలు వినతులను మంత్రి ఆప్యాయంగా స్వీకరించారు. ప్రజలతో ప్రత్యక్షంగా కలిసిన లోకేష్, సమస్యల పరిష్కారానికి తన స్థాయిలో చేసే కృషిని ఆశ్వసించారు. ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతో పెద్దఎత్తున హాజరయ్యారు.

 
				 
				
			 
				
			 
				
			