రెండు రోజుల పాటు వర్షాల ముప్పు
ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ద్రోణి ప్రభావం, వాతావరణ అనిశ్చితి కారణంగా మంగళవారం మరియు బుధవారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.
ఎటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడతాయంటే?
ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాల సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముంది. వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తేలికపాటి జల్లులు కురిసే ప్రాంతాలు
విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాన కారణంగా రైతులు తమ వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు
ఇక నిన్న పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి నమోదైంది. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డవ్వగా, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీలు నమోదయ్యాయి. అయితే వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 
				 
				
			 
				 
				