అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారత విద్యార్థి మోసానికి పాల్పడి స్థానిక అధికారులకు చిక్కాడు. నార్త్ కరోలినాలోని గైల్‌ఫోర్డ్ కౌంటీలో ఓ వృద్ధురాలిని మోసం చేయబోయిన ఘటన కలకలం రేపుతోంది. స్టూడెంట్ వీసాతో అమెరికా వెళ్లిన కిషన్ కుమార్ సింగ్ అనే యువకుడు, ఫెడరల్ ఏజెంట్‌గా నటిస్తూ మోసానికి తెగబడ్డాడు.
స్టోక్స్‌డేల్ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల వృద్ధురాలికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వారు తాము ఫెడరల్ ఏజెంట్లు అని చెప్పి, ఆమె బ్యాంకు ఖాతాలో నేర కార్యకలాపాలు జరిగాయన్న కబురుతో ఆమెను భయబ్రాంతికి గురిచేశారు. డబ్బు తమకు అప్పగించాలని ఒత్తిడి తెచ్చారు. ఈ డబ్బు తీసుకునేందుకు కిషన్ కుమార్ సింగ్ ఆమె ఇంటికి వెళ్లగా, అప్పటికే అప్రమత్తమైన పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో కిషన్ కుమార్ సింగ్ 2024 నుంచి అమెరికాలో స్టూడెంట్ వీసాపై ఉన్నట్లు వెల్లడైంది. ఒహాయోలో నివసిస్తున్న అతను ఈ మోసానికి నేరుగా పాలుపంచుకున్నాడని అధికారులు ధ్రువీకరించారు. గైల్‌ఫోర్డ్ కౌంటీ షెరీఫ్ డానీ హెచ్. రోజర్స్ కూడా ఈ అరెస్టును ధ్రువీకరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ నకిలీ అధికారిగా వ్యవహరించడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు.
ఈ కేసులో దోషిగా తేలితే కిషన్‌కు తీవ్ర శిక్షలు విధించే అవకాశం ఉంది. అతని విద్యార్థి వీసా రద్దు కావడం, అనంతరం అమెరికా నుంచి బహిష్కరణ జరగడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులపై నీడ పడే అవకాశముంది. విద్యార్థులు ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరికగా భావించాలి.
