పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రోత్సాహం ఉన్నదని బలంగా నమ్ముతున్న భారత ప్రభుత్వం, ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఒత్తిడికి గురిచేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేసిన కేంద్రం… తాజాగా సముద్ర రవాణా మార్గాలపైనా కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో సముద్ర మార్గాలను పూర్తిగా మూసివేస్తూ, వ్యాపార రవాణాకు అడ్డుకట్ట వేసింది.
ఈ చర్య మర్చంట్ షిప్పింగ్ యాక్ట్ -1958 లోని సెక్షన్ 411 ఆధారంగా తీసుకున్నారు. ఇందులో భాగంగా, పాకిస్థాన్ జెండా కలిగిన నౌకలు భారతదేశ పోర్టులకు చేరలేవు. అదే విధంగా భారత జెండా కలిగిన నౌకలు పాకిస్థాన్ పోర్టుల్లోకి వెళ్లకుండా నిషేధం విధించారు. ఇది రెండుదేశాల మధ్య సముద్ర సంబంధాల పాక్షికంగా తెగిపోవడమే కాకుండా, వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.
ఇదే కాకుండా, ఇప్పటికే భారత గగనతలాన్ని పాకిస్థాన్ విమానాలకు మూసివేసిన కేంద్రం, వాణిజ్య సంబంధాలపై కూడా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో సముద్ర రవాణా మార్గాలపై నిషేధం మరింత తీవ్రమైన చర్యగా చెబుతున్నారు. పాక్ మీద ఒత్తిడి పెంచేందుకు కేంద్రం మెరుపు వేగంతో చర్యలు తీసుకుంటున్నదన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చర్యలన్నింటి వెనక ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశాలను అంతర్జాతీయంగా మౌనంగా అంగీకరించకుండా అడ్డుకోవాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సముద్ర మార్గాల మూసివేత వల్ల పాకిస్థాన్ కు దిగుమతులు, ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో, పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి తలెత్తనుంది.
