రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌లో రైతుల గోడు గురించి వివరించారు.
మిరప, పత్తి, జొన్న, వేరుశెనగ, పొగాకు వంటి పంటలకు కనీస ధరలు లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను విస్మరించిందన్నారు. కేంద్రం పరిధిలో లేని మిరపను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి చివరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం రైతులపై మోసం అని ఆరోపించారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, రూ.7,796 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. కనీస మద్దతు ధరల జాబితాలో లేని పంటలకూ మద్దతు ఇచ్చామని చెప్పారు. బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.
ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా వంటి పంటలు సాగు చేస్తున్న రైతులు ఇప్పటికే ఆందోళనల్లో ఉన్నారని, ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడే జనాభా పెద్ద సంఖ్యలో ఉండగా, రంగాన్ని పట్టించుకోకపోతే ఉపాధికి గండిపడుతుందని హెచ్చరించారు. మార్కెట్ జోక్యంతోపాటు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు.
