ఢిల్లీ కేంద్రంలో ఉన్న ఏపీ భవన్‌కు శుక్రవారం రాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈమెయిల్లో భవన్‌ను పేల్చేస్తామని పేర్కొనడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చిన ఈ బెదిరింపు అధికారులను ఆందోళనకు గురిచేసింది.
ఆ సమయంలో భవన్లో పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. వారు ‘‘పూలే’’ సినిమా ప్రత్యేక ప్రదర్శన కోసం అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో మెయిల్ రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సంబంధిత పోలీసులకు సమాచారం అందించగా, వారు బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.
బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు కలిసి భవన్లో ప్రతీ ప్రాంతాన్ని శోధించాయి. సుదీర్ఘంగా జరిగిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తేలడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. భవన్ పరిసరాలనూ పూర్తిగా చెక్ చేశారు.
ఇదిలా ఉండగా, బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ విభాగం సాయం తీసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మెయిల్ వెనక ముఠాను పట్టుకునేందుకు పోలీసు దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
