హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల యువతి తన ఇంటి పక్కన ఉండే 16 ఏళ్ల మైనర్ బాలుడితో పరిచయం పెంచుకుని పలు మార్లు లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి బాలుడిని తన ఇంటికి పిలిచి మాయమాటలతో లోబరచుకుంది.
ఆమె పలు మార్లు తన ఇంట్లో బాలుడిపై లైంగికదాడికి పాల్పడింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తనపైనే అత్యాచారం చేశావని నిందేస్తానని బెదిరించింది. భయంతో బాలుడు ఎవరికీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇటు వేధింపులు రోజురోజుకూ పెరగడం వల్ల మానసికంగా ప్రభావితమైన బాలుడు, చివరికి తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు.
బాలుడి మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత బాలుడికి కౌన్సిలింగ్ అందించడంతోపాటు, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై సంఘం విస్తుపోయిన నేపథ్యంలో, నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండు వినిపిస్తోంది.