పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ దాడి వెనక పాకిస్థాన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది. దాంతో ఆ దేశంపై భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ నుంచి జరిగే అన్ని రకాల దిగుమతులను నిషేధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నిషేధం ప్రబలంగా అమలులోకి వస్తోంది. నేరుగా కాకపోయినా పరోక్షంగా పాక్ మూలం కలిగిన వస్తువులు భారత్‌లోకి రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే, మూడో దేశాల ద్వారా వచ్చినప్పటికీ వాటి మూలం పాకిస్థాన్ అయితే, వాటిని కూడా భారత్‌లోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది.
ప్రస్తుతం రవాణా మార్గంలో ఉన్న వస్తువులకూ ఈ నిషేధం వర్తిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పాకిస్థాన్ మూలం కలిగిన అన్ని రకాల వస్తువుల దిగుమతిని తక్షణమే ఆపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు జాతీయ భద్రతకోసం తీసుకున్న చర్యలలో భాగమని స్పష్టం చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ నిషేధానికి మినహాయింపులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఆ మినహాయింపులకు కూడా భారత ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఉగ్రదాడులపై భారత్ ధీటుగా స్పందిస్తోందని, భద్రతను ఆశించిన స్థాయిలో కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యగా ఇది నిలిచింది.
