ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులో జాప్యంపై తిరుపతిలో ధర్నా నిర్వహించిన ఘటనకు సంబంధించి నమోదైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆయనకు ఊరట లభించలేదు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.
జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ, విచారణ అధికారుల ఎదుట మోహన్‌బాబు తప్పకుండా హాజరు కావాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ధర్నా జరిగిన సమయంలో మోహన్‌బాబు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారా? అనే అంశాన్ని కూడ ప్రశ్నించింది.
మోహన్‌బాబు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది, ఆయన వయసు 75 సంవత్సరాలు అని, విద్యాసంస్థను నడుపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులపై ఎలెక్షన్ కోడ్ వర్తించదని వాదించారు. తమ విద్యాసంస్థ విద్యార్థుల కోసం మాత్రమే ధర్నా నిర్వహించిందని, ఇది రాజకీయ ఉద్దేశాలతో జరగలేదని వివరించారు. అయినా కోడ్ ఉల్లంఘనగా కేసు నమోదు చేయడం సబబు కాదని తెలిపారు.
అయితే ధర్మాసనం ఈ వాదనలను పరిశీలించిన తరువాత స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో మోహన్‌బాబుకు న్యాయపరంగా ఎదురుదెబ్బ తగలగా, విచారణ అధికారి ఎదుట హాజరై స్పందించాల్సిన బాధ్యత ఆయనపై పడింది.
