రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌పై మంగళవారం ఉదయం సైబర్ దాడి జరిగింది. వెబ్సైట్ హోమ్‌పేజీని హ్యాకర్లు పూర్తిగా మార్చి, “పాకిస్థాన్ సైబర్ ఫోర్స్” పేరుతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌ను తెరిచిన వెంటనే రెచ్చగొట్టే సందేశాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ దాడి పాకిస్థాన్ హ్యాకర్ల గుట్టును బట్టినట్లు తెలిపారు.
హ్యాక్ అయిన వెబ్సైట్ హోమ్‌పేజీలో “ఫెంటాస్టిక్ టీ క్లబ్ పాకిస్థాన్ సైబర్ ఫోర్స్” అనే శీర్షికతో పాటు, పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు ఉంచారు. “పహల్గామ్ దాడి కాదు… అది అంతర్గత కుట్ర… నిప్పు రాజేసింది మీరే, ఇప్పుడు పర్యవసానాలకు సిద్ధంగా ఉండండి” అంటూ పోస్టులు పెట్టారు. పాకిస్థాన్ హ్యాకర్లు ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి భార్యను ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని అభివర్ణించారు.
అంతేకాకుండా, 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విషయాన్ని కూడా ఎగతాళి చేశారు. ఆ సమయంలో అభినందన్, పాక్ అధికారులతో తాగిన టీపై వీడియో వైరల్ అయ్యింది. దానిని ప్రస్తావిస్తూ హ్యాకర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సైబర్ దాడి వెలుగులోకి రావడంతో, రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. “మేము వెబ్‌సైట్‌ను మూసివేసి, పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నాం. సైబర్ భద్రతా ఏజెన్సీలకు సమాచారం అందించాం. దర్యాప్తు ప్రారంభించాం,” అని విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ చెప్పారు.

 
				 
				
			 
				
			 
				
			