బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాయామ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా సందేశం పంపారు.
వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొంటూ.. “సోదరుడు కేటీఆర్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. జగన్ సానుభూతి చూపించిన విషయంపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయ భిన్నతలను మరిచి మనిషితనానికి మద్దతుగా స్పందించిన జగన్ తీరు ప్రశంసనీయమని వ్యాఖ్యానిస్తున్నారు.
కేటీఆర్ వ్యాయామ సమయంలో గాయపడడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు తెలిపారు.
కేటీఆర్ గాయంపై పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ మళ్లీ ఆరోగ్యంగా తన కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.