ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్రంగా విమర్శించబడ్డాయి. ముఖ్యంగా అతను బ్యాటింగ్‌కు ఏడో స్థానంలో రావడం అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
పంత్ లక్నో ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి మాత్రమే క్రీజులోకి వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఔటయ్యాడు. ఇంతవరకూ కీలక సమయంలో ముందుండాల్సిన కెప్టెన్, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇలా వెనుకకు వెళ్లడంపై సోషల్ మీడియాలో కూడా చర్చలు ఊపందుకున్నాయి. 19వ ఓవర్ సమయంలో ప్యాడ్లతో సిద్ధంగా ఉన్న పంత్, జాహీర్ ఖాన్‌తో డగౌట్‌లో తీవ్రంగా చర్చిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ ఘటనలు పంత్ నాయకత్వంపై ప్రశ్నలు తెరలేపాయి. ముఖ్యంగా ఓపికగా ఆడాల్సిన సమయాల్లో అతని ఆలస్యం జట్టుకు నష్టాన్ని కలిగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అభిమానులు “పంత్ ఎందుకు ముందుగా బ్యాటింగ్‌కు రాలేదు?” అనే ప్రశ్న వేస్తున్నారు. జట్టు ప్రయోజనాన్ని కంటే వ్యూహాత్మక తప్పిదాలు ఎక్కువయ్యాయని నిపుణుల వ్యాఖ్యానించారు.
మ్యాచ్ అనంతరం పంత్ స్పందిస్తూ, “మేము 20 పరుగులు తక్కువ చేశాము. టాస్ కూడా చాలా కీలకమైంది. మొదట బ్యాటింగ్ చేయడంతో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాం” అని తెలిపాడు. కానీ లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 13 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించింది. రాహుల్, అభిషేక్ పోరెల్ కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
