పృథ్వీ మొదటిగా ‘పెళ్లి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఆయన పోషించిన ‘బబ్లూ’ పాత్రతో గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆయన పేరు ముందు ‘బబ్లూ’ అన్న పదం స్థిరపడిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో చేసిన పాత్రకు మంచి స్పందన లభించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ తన కెరీర్ ప్రయాణాన్ని పంచుకున్నారు. “నాకెప్పుడూ ఫిట్నెస్ మీద దృష్టి ఉండేది. మంచి లుక్స్ ఉండేవి, అందువల్ల హీరో కావాలని కోరిక ఉండేది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా చేశాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అవి పూర్తవ్వలేదు. కాబట్టి వచ్చిన అవకాశాలను ఒప్పుకుంటూ ముందుకు సాగాను” అన్నారు.
పృథ్వీ తన సినీ జీవితంలో బాలకృష్ణతో చేసిన అనుభవాలను కూడా గుర్తు చేసుకున్నారు. “బాలకృష్ణ గారి క్రమశిక్షణను దగ్గరగా చూశాను. ఆయనలా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లలో కూడా అదే అంకితభావం ఉంది. నేను ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి మైలురాయిగా నిలిచింది” అని తెలిపారు.
తన రెమ్యునరేషన్ విషయంలో పృథ్వీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నా మొదటి సినిమా ‘పెళ్లి’కి నాకు 50 వేలు పారితోషికం వచ్చేది. కానీ ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కోసం 50 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇది నా కెరీర్లో ఇప్పటివరకు తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్” అని చెప్పి తన అభినయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
