గద్వాల్ పట్టణంలో వక్ఫ్ బోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించాలంటూ ముస్లిం సమాజం ఉమ్మడి ఆందోళన చేపట్టింది. ధరూర్మెట్లోని ప్రముఖ దర్గా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది.
ఈ నిరసనకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ సహా పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ ఆస్తులపై కన్నేసి బిల్లు రూపంలో కొత్త కుట్రను ఆవిష్కరించిందని వారు ఆరోపించారు.
బిల్లు ద్వారా ముస్లిం మైనారిటీల ఆస్తులను స్వాధీనం చేసుకునే కుట్రను కేంద్రం చేస్తున్నదని, ఇది మైనారిటీల హక్కులపై దాడిగా గుర్తించాలని వారు అన్నారు. భారత రాజ్యాంగ ఆత్మకు విరుద్ధంగా మతపరమైన ప్రాతిపదికన చట్టాలు చేయడం దారుణమని విమర్శించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలను దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉన్నదని ర్యాలీలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ప్రజలంతా సంఘీభావంతో మద్దతుగా నిలవాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

 
				 
				
			 
				
			