అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ భారత మూలాల మహిళ. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందినవారు. అక్కడి నుంచే వారు అమెరికాకు వలస వెళ్లారు. ఉషా అమెరికాలోనే జన్మించి పెరిగారు. కాలేజీ రోజులలో జేడీ వాన్స్‌తో పరిచయం ప్రేమగా మారి, వివాహంతో ముగిసింది.
గతేడాది జేడీ వాన్స్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వడ్లూరులోని గ్రామస్థులు అతని గెలుపుకోసం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో హోమాలు నిర్వహించి, తమ ఊరి ముద్దుల కోడలికి విజయాన్ని కోరారు. ఆ ఆశలు నిజమయ్యాయి. ఎన్నికల్లో విజయం సాధించిన జేడీ వాన్స్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.
ఇప్పుడు తొలిసారి జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారతదేశ పర్యటనకు వస్తున్నారు. నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న ఆయన కుటుంబంతోపాటు ఉషా వాన్స్ స్వగ్రామం వడ్లూరు కూడా సందర్శించవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఉష రాక కోసం గ్రామస్థులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
గ్రామస్థుల కథనాల ప్రకారం, గతంలో ఉషా వాన్స్ కుటుంబం గ్రామాభివృద్ధిలో చురుకుగా పాల్గొంది. స్థానికంగా విద్యా సంస్థల అభివృద్ధికి తోడ్పడిందని చెబుతున్నారు. ఆమె రాక ద్వారా గ్రామానికి మరింత గుర్తింపు వస్తుందన్న ఆశ గ్రామ ప్రజల్లో కనిపిస్తోంది. ఉషను ఘనంగా ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు.