పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సాగునీటి కాలువల ప్రాజెక్టులపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులకు నిరసనగా స్థానికులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మత వ్యవహారాల హిందూ రాష్ట్ర మంత్రి ఖేల్ దాస్ కొహిస్తానీ కాన్వాయ్‌పై దాడి జరిగింది.
సింధ్‌లోని థట్టా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో, ఆందోళనకారులు బంగాళదుంపలు, టమాటాలతో కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారు. అయితే మంత్రి ఖేల్ దాస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీపై ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఇది హిందూ మంత్రిపై దాడిగా మాత్రమే కాక, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహాన్ని చూపించేందుకు జరిగిన చర్యగా భావిస్తున్నారు.
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఒక మంత్రిపై ఇలా దాడికి పాల్పడటాన్ని ఆయన ఖండించారు. అలాగే ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింధ్ ప్రావిన్స్‌లో హిందువులు సహా అనేక మైనారిటీలు నివసిస్తుండటంతో ఈ దాడి మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
పంజాబ్ ప్రావిన్స్‌లో గ్రీన్ పాకిస్థాన్ ప్రాజెక్టు కింద ఆర్మీ సహకారంతో 6 సాగునీటి కాలువలు నిర్మించాలన్న ప్రణాళిక ఉంది. దీనికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపగా, సింధ్ ప్రాంతంలోని జాతీయవాద పార్టీలు, సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కాలువల నిర్మాణం వల్ల సింధ్ రాష్ట్రానికి నీటి కొరత ఏర్పడుతుందని వారు ఆరోపిస్తున్నారు. కొహిస్తానీ 2018లో ఎంపీగా ఎన్నికై, 2024లో మళ్లీ విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.