ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్రధారులైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి కఠినమైన టారిఫ్లను విధించుకుంటూ వాణిజ్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. తాజా పరిణామాల్లో చైనా, అమెరికాతో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ఇతర దేశాలను హెచ్చరించడం గమనార్హం. తమ ప్రయోజనాలను దెబ్బతీసే ఒప్పందాలు చేస్తే సహించబోమని స్పష్టం చేసింది.
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా ఒత్తిడి మేరకు చైనాతో వ్యాపారాన్ని తగ్గించేలా ఇతర దేశాలు అడుగులు వేస్తే, కచ్చితంగా తగినదే స్పందన చూపుతామని తెలిపింది. అమెరికా ఒక్కపక్షంగా సుంకాల విధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ, ఇతర దేశాలపై రక్షణాత్మక ఒత్తిడిని చూపుతోందని ఆరోపించింది. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్య సమతుల్యత దెబ్బతింటుందని తెలిపింది.
“ఇతరుల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలు ఎప్పటికీ విజయవంతం కావు” అని పేర్కొంటూ, తమ హక్కులను కాపాడుకునే పూర్తి సామర్థ్యం తమకుందని చైనా పేర్కొంది. చైనాపై ఒత్తిడి తేవాలన్న అమెరికా ఉద్దేశాలను ప్రపంచ దేశాలు గమనించాలని సూచించింది. అవసరమైతే, తమ ప్రయోజనాల కోసం వ్యతిరేక చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేసింది.
అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చైనా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఒక మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా మాత్రం చర్చల విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. వాణిజ్య యుద్ధం కొనసాగుతుందన్న సంకేతాలను ఇస్తూనే, సంభాషణలకు తాము సిద్ధమనే సందేశం ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
