ఖైదీల సంక్షేమం, కుటుంబ హక్కుల పరిరక్షణ దిశగా ఇటలీ ప్రభుత్వం చారిత్రాత్మకమైన మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం, జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో నెలకు కనీసం నాలుగు సార్లు ములాఖత్ చేసుకునే హక్కును పొందారు. అంతేకాదు, ప్రతి ఆరు వారాలకు ఒకసారి గంటపాటు ఏకాంతంగా గడిపే అవకాశం కూడా కల్పించనున్నారు.
ఇప్పటివరకు జైళ్లలో జరిగే ములాఖత్‌లు అధికారుల పర్యవేక్షణలో, పరిమిత సమయంతో మాత్రమే ఉండేవి. ఖైదీలు తమ జీవిత భాగస్వాములతో స్వేచ్ఛగా మాట్లాడుకునే, అనుబంధాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేది కాదు. తాజా మార్గదర్శకాలు ఖైదీల మానసిక శాంతి, కుటుంబ అనుబంధాల పరిరక్షణకు దోహదపడతాయని ప్రభుత్వం పేర్కొంది. అవసరమైతే ఈ ఏకాంత సమయాన్ని అధికారులు పొడిగించే వీలుంది.
ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయం యూరోపియన్ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉందని మానవ హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఖైదీలు కుటుంబాలతో సంబంధాలను కొనసాగిస్తే మానసిక పరిపక్వత, నేరప్రవృత్తి తగ్గే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇది పునరావాసానికి, సమాజంలో పునఃఏకీకరణకు దోహదపడే విధంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈ విధానం వల్ల జైళ్లలో భద్రతా సమస్యలు తలెత్తవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇటలీ ప్రభుత్వం స్పందిస్తూ, ములాఖత్‌లను భద్రతకు ముప్పు లేకుండా, నియంత్రితంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఖైదీల పునరావాసాన్ని ప్రోత్సహించే ఈ నూతన విధానం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీయవచ్చు.
