కెనడాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారతీయ విద్యార్థిని హర్‌సిమ్రత్ రంధావా (21) అనుకోని విధంగా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన బుధవారం సాయంత్రం అంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్ నగరంలో చోటుచేసుకుంది. మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్, పని కోసం బస్టాప్ వద్ద ఎదురుచూస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. రెండు వాహనాల మధ్య ఘర్షణలో చోటు చేసుకున్న కాల్పుల్లో, తుపాకీ గుండె ఆమె ఛాతీకి తాకడంతో తీవ్రంగా గాయపడింది.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 సమయంలో ఈ ఘటన జరిగిందని హామిల్టన్ పోలీసులు తెలిపారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హర్‌సిమ్రత్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాల్పుల ఘటనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా అమాయకురాలని పోలీసులు స్పష్టం చేశారు.
ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాల ప్రకారం, నల్ల కారులోని వ్యక్తి తెల్ల కారుపై కాల్పులు జరిపినట్టు గుర్తించారు. అనంతరం రెండు వాహనాలు ఘటనా స్థలాన్ని విడిచి వెళ్లిపోయాయి. ఈ కాల్పుల్లో హర్‌సిమ్రత్ అనుకోకుండా బుల్లెట్‌కు గురై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ టొరంటోలోని భారత కాన్సులేట్ స్పందించింది. ఆమె కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయం అందిస్తున్నామని ప్రకటించింది.
హామిల్టన్ పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా వీడియో ఫుటేజీ లేదా సమాచారాన్ని కలిగి ఉంటే, పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. హర్‌సిమ్రత్ కుటుంబానికి భారత ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి తెలిపింది.
