ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత ప్రేమ వివాహంతో వార్తల్లో నిలిచారు. తన ప్రేమికుడు సంభవ్ జైన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని కపూర్తలా హౌస్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగింది. ఈ ప్రదేశం మహారాజా ఆఫ్ కపూర్తలా అధికార నివాసంగా పేరుగాంచింది.
కేజ్రీవాల్ తన కుమార్తె వివాహాన్ని కుటుంబ సమక్షంలో జరిపించారు. ఈ పూజా కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. వివాహానికి ముఖ్యఅతిథులుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హాజరయ్యారు. సంగీత్ ఈవెంట్‌లో భగవంత్ మాన్ చేసిన బాంగ్రా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హర్షిత, సంభవ్ జైన్ ఇద్దరూ ఐఐటీ ఢిల్లీలో చదువుకునే సమయంలో పరిచయమయ్యారు. విద్యార్థి దశలో ప్రారంభమైన స్నేహం ప్రేమగా మారింది. కుటుంబాల అంగీకారంతో ఈ పెళ్లి జరిగింది. వారి బంధం ప్రేమకు, విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది.
ఇటీవలే ఈ జంట కలసి ఓ స్టార్టప్‌ను కూడా ప్రారంభించారు. వ్యక్తిగత జీవితం, వృత్తిపరంగా కూడా కలిసి ముందుకెళ్లే దిశగా పయనిస్తున్నారు. పెళ్లి వేడుకకు హాజరైన అతిథులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ వర్గాల్లో కూడా ఈ వివాహం చర్చనీయాంశమైంది.
