హైదరాబాద్ ఫతేనగర్‌లోని హోమ్ వ్యాలీలో ఓ దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి పాపం ఏమరుపాటు లేకుండా ఉన్న ఐదు కుక్క పిల్లలను నేలకేసి కొట్టి చంపాడు. ఈ ఘటన అక్కడి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘోరాన్ని చూసిన స్థానికులు వెంటనే అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
దాంతో అసలైన నిజం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యాపారి ఆశిష్ అనే వ్యక్తే ఈ అమానుష ఘటనకు కారణమని తెలిసింది. అతని పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని, కోపంతో ఆ వీధి కుక్క పిల్లలను హింసించి చంపేశాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా అతనిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై జంతు ప్రేమికులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూగ జీవాలపై ఇలాంటి క్రూర చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదంటూ కఠిన శిక్షల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇటువంటి ఘటనలు జంతుశ్రేయస్సు కోసం రూపొందించిన చట్టాలపై ప్రశ్నలు వేస్తున్నాయి. తక్షణ చర్యలు తీసుకుని ఆ వ్యక్తిని శిక్షించాల్సిన అవసరం ఉందని సమాజం భావిస్తోంది. నేరానికి తగిన విధంగా శిక్షించడమే ఇలాంటి ఘటనలకి అడ్డుకట్ట అవుతుంది.