తమిళ సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాను మరింత చర్చనీయాంశం చేసారు. ఆయన తన అనుమతి లేకుండా తన స్వరపరిచిన పాటలను ఈ చిత్రంలో ఉపయోగించుకోవడం పై హక్కులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు జారీ చేశారు.
ఇళయరాజా తన నోటీసులో పేర్కొన్న ప్రకారం, గతంలో స్వరపరిచిన మూడు ప్రఖ్యాత గీతాలను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో ఉపయోగించినట్లు చెప్పారు. అయితే, వీటి కోసం ఏదైనా ముందస్తు అనుమతి లేదా హక్కులు తీసుకోకుండా ఈ పాటలను రీక్రియేట్ చేసి వాడినట్లు ఆయన ఆరోపించారు. ఇది కాపీరైట్ చట్టం ఉల్లంఘనని ఆయన స్పష్టం చేశారు.
ఇళయరాజా ఈ ఉల్లంఘనకు గాను, చిత్ర నిర్మాతలు తక్షణమే రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసులో, చిత్రానికి సంబంధించిన మూడు పాటలను వెంటనే తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా ఆయన కోరారు. ఇళయరాజా చేసిన ఈ ఆందోళనకు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రతిస్పందన రాలేదు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన విడుదలైంది. యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి సాధారణ స్పందన పొందింది. కానీ ఈ లీగల్ నోటీసు సినిమాకు మరింత శబ్దం తెచ్చింది.
