విశాఖపట్నం మరియు విజయవాడ మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విమానాలు రద్దవడంతో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇది సగటు ప్రయాణికుడికి ఎదురయ్యే కష్టాలను తెలియజేస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి పరిపాలన రాజధాని అమరావతి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన తాను, హైదరాబాద్‌కి వెళ్లి, అక్కడి నుంచి మరో విమానం ద్వారా విజయవాడ చేరుకున్నానని వివరించారు. మధ్యాహ్నం ఒంటి గంటలో గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగానని తెలిపారు.
తనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కావడానికి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించారని చెప్పారు. ఉదయపు రెండు విమానాల రద్దుతోనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. పైగా మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణం మరింత కష్టమైందన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన తన విమాన టికెట్ల ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య నేరుగా విమానాలు లేకపోవడం ఆందోళనకరమని, ఇది ప్రయాణికుల సమయాన్ని, శక్తిని వృథా చేస్తున్నదని గంటా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఈ సమస్యను గమనించి వెంటనే పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

 
				 
				
			 
				
			 
				
			