ఎండ వేడి అతి తీవ్రంగా ఉండే ఢిల్లీలో, వేసవిలో విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఒక కళాశాల ప్రిన్సిపాల్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉన్న డాక్టర్ ప్రత్యూష్ వత్సల, తరగతి గదులను చల్లగా ఉంచే తాత్కాలిక మార్గంగా ఆవుపేడను ఉపయోగించారు. ఇది శరీరానికి హానికరం కాకుండా ప్రకృతిసిద్ధమైన పరిష్కారమని ఆమె భావిస్తున్నారు.
ఈ ప్రయోగంలో భాగంగా, కాలేజీలోని తరగతుల గోడలపై స్వయంగా ఆవుపేడ పూశారు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల గోడలకు, నేలలకు ఆవుపేడ పూయడం ద్వారా చల్లదనం పొందేవారు. అదే పద్ధతిని ఆధునిక విద్యాసంస్థలో ఉపయోగిస్తూ ప్రకృతి అనుకూల పరిష్కారాన్ని అందించాలనే లక్ష్యంతో ఆమె ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదు అవుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా తరగతుల వాతావరణాన్ని చల్లగా ఉంచడం కోసం ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు. ఇది కేవలం తాత్కాలిక చర్యగా కాకుండా, పరిశోధనలో భాగంగా చేయబడిందని ఆమె వివరించారు. మరో వారం రోజుల్లో ఈ పరిశోధన ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.
ఈ ప్రయత్నానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు దీనిని అభినందించగా, మరికొందరు విచిత్రంగా అభిప్రాయపడుతున్నారు. అయితే, డాక్టర్ వత్సల చర్య విద్యార్థుల కోసమైనదే అని తెలియజేస్తూ, ప్రకృతితో అనుసంధానమైన పరిష్కారాలకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
