జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, పెళ్లి సంబంధాలు వరుసగా కుదరకపోవడంతో మనోవేదనకు గురైన ఓ మహిళా కానిస్టేబుల్ నీలిమ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
నీలిమ 2020లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై శిక్షణను పూర్తి చేసిన తరువాత వరంగల్ కమిషనరేట్‌లో విధుల్లో చేరింది. ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూసినా అనేక కారణాలతో అవి కుదరలేదు. ఈ కారణంగా కొంతకాలం సంబంధాల వెతకడం ఆపేశారు.
తాజాగా మళ్లీ సంబంధాలు చూడడం ప్రారంభించినప్పటికీ ఎటువంటి పాజిటివ్ ఫలితాలు లేకపోవడం ఆమెను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. పెళ్లి విషయమై తరచూ ఎదురవుతున్న నిరాకరణలు ఆమెకు అవమానంగా అనిపించాయి. ఈ కారణంగా ఆమె మనోవేదనకు లోనయ్యారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన నీలిమ మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో విషాదం నెలకొంది.