మధిర నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి పథకాలను ప్రారంభించి మాట్లాడారు.
మధిర పట్టణంలో 128 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఇది పట్టణ ప్రగతికి దోహదపడుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తైతే ప్రజలకు సుళువైన జీవన వాతావరణం లభిస్తుందని తెలిపారు.
వంగవీడు గ్రామం నుంచి నక్కల గురువు గ్రామం వరకు రూ.5.25 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని అన్నారు.
అలానే ఆత్కూరు నుంచి పిల్లిగుట్ట గ్రామం వరకు రూ.4.50 కోట్లు, కృష్ణాపురం నుంచి భగవాన్లపురం వరకు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని భట్టి విక్రమార్క తెలిపారు.