ఇప్పటి వరకు ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో ప్రతి జట్టు దాదాపు ఆరు మ్యాచ్ లు ఆడగా, పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వరుస విజయాలతో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలవగా, వరుస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానానికి పరిమితమైంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించింది. ఇదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ కూడా నాలుగు మ్యాచ్ లలో గెలుపొందాయి. అయితే గుజరాత్ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా టాప్‌లో నిలిచింది. మిగిలిన జట్లు రెండో నుంచి నాలుగో స్థానాల్లో స్థిరపడ్డాయి.
ఆదివారం నాటికి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడగా, మిగిలిన జట్లు ఆరు మ్యాచ్ లు పూర్తి చేశాయి. టాప్ నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే.
ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాదు జట్లు ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేశాయి. నెట్ రన్ రేట్ పరంగా ఈ ముగ్గురు జట్లలో ముంబయి ఇండియన్స్ కొంతమేరకు ముందంజలో ఉంది. దీంతో టోర్నీలో ప్రస్తుతం గట్టి పోటీ కొనసాగుతోంది.