తత్కాల్ రైల్వే టికెట్ల బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగాయన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా ప్రచారంలోకి వచ్చాయి. ఏప్రిల్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఓ ఫేక్ పోస్టర్ వైరల్ అయింది. దీనిపై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తను పూర్తిగా ఖండించింది. వైరల్ అవుతున్న పోస్టర్‌ను అసత్య ప్రచారంగా పేర్కొంది. తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి ఏసీ, నాన్‌ఏసీ తరగతుల బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.
అలాగే, రిజర్వేషన్ ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్ సమయాల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదని పీఐబీ తెలిపింది. ప్రయాణికులు సోషల్ మీడియాలో వచ్చే ఈ విధమైన తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే విశ్వసించాలని సూచించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ బుకింగ్ సమయాలు యధాతధంగా కొనసాగుతున్నాయని స్పష్టంగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకుండా వైరల్ అవుతున్న సమాచారం పూర్తిగా తప్పు అని తెలిపారు. ప్రజలు మోసపోకుండా జాగ్రత్త వహించాలని పీఐబీ కోరింది.
