ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని సూచించినప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంపై పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారి నోటీసులు అందుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఆయన, నియోజకవర్గం లోనే ఉన్నానని ప్రకటించారు.
ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “పులిని అన్నావ్.. తొడ కొట్టావ్.. ఇప్పుడు ఎక్కడికి పారిపోయావ్?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల విచారణకు హాజరుకావడంలో తప్పేముంది? అని నిలదీశారు.
కాకాణి తాను దోషి కాదని నమ్మకం ఉంటే విచారణకు హాజరవ్వాల్సిందని, అయితే ఇప్పుడు కనపడకపోవడం అనుమానాలు పెంచుతోందని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలోనే ఉన్నానన్న మనిషి ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు సోమిరెడ్డి. రాజకీయ నేతగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
ఇక తన వ్యంగ్య వ్యాఖ్యల్లో, ‘‘ఒకవేళ జైలుకు వెళ్తే అక్కడ నీ స్నేహితుడు వల్లభనేని వంశీ ఉంటాడు, పలకరించు’’ అంటూ కాటుకల మాటలతో కాకాణిపై విరుచుకుపడ్డారు సోమిరెడ్డి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
