రాజస్థాన్ రాష్ట్రంలోని బారన్ జిల్లాలో ఫౌండేషన్ డే వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్‌ను పరీక్షిస్తున్న సమయంలో అచానక గాలిలోకి లేచింది. అదే సమయంలో బెలూన్‌కు కట్టిన తాడుకు ఓ వ్యక్తి చేతి వేసి ఉండడంతో అతను కూడా బెలూన్‌తో పాటు పైకి ఎగిరిపోయాడు.
బెలూన్ సుమారు వంద అడుగుల ఎత్తుకు వెళ్లిన తరువాత తాడు తెగిపోయింది. దీంతో ఆ వ్యక్తి భూమిపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనతో స్థానికులు తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రాజస్థాన్‌లోని కోటాకు చెందిన వాసుదేవ్ ఖాత్రిగా పోలీసులు గుర్తించారు. ఫౌండేషన్ డే కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించాల్సిన మూడు రోజుల వేడుకలను అధికారులు రద్దు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బెలూన్ గాలిలోకి లేచిన దృశ్యం, తాడుకు వేలాడుతున్న వ్యక్తి, తాడు తెగిన తరువాత కింద పడిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వేడుకలకు భద్రతా చర్యలు పాటించలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
