ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేక అభిమానులను నిరాశపరుస్తోంది. వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే నమోదు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అయితే, గత నాలుగు మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్‌లో మాత్రమే బ్యాటింగ్ చేసిన ధోనీపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టుకు భారంగా మారాడనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఆయన ఈ ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చినట్టు మార్మోగింది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ధోనీకి మద్దతుగా నిలిచాడు. “ధోనీ జట్టుకు భారంగా ఎప్పటికీ మారడు. అతని ఆటతీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. చెన్నై ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. జట్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ధోనీ కృషి చేస్తాడు. అతని అనుభవం జట్టుకు కీలకం,” అని ఉతప్ప వ్యాఖ్యానించాడు.
ఉతప్ప చెప్పిన వ్యాఖ్యలు సీఎస్‌కే అభిమానులకు ఊరటనిచ్చాయి. జట్టు ప్రస్తుతం బలహీనంగా కనిపించినా, ధోనీ దారిచూపిస్తాడనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు. రాబోయే మ్యాచ్‌లలో సీఎస్‌కే గెలుపు బాట పట్టి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

 
				 
				
			 
				
			 
				
			